తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే.అయితే,బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు.

Srivari Bramhotsavams


 స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు.బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది.ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం(దించడం) చేస్తారు.

          ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే!

No comments