ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - తిరుమల

 
చారిత్రక పరంగా చూస్తే తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారమైన ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు.ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి మామగారైన ఆకాశరాజుకు సోదరుడు. 

కలియుగంలో భక్తులను తరింపజేయటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి తిరుమలను కలియుగ వైకుంఠంగా నిలబెట్టాడు.ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వారించి నిలబెట్టినాడు.అప్పుడు వారిరువురి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది.శ్రీమహావిష్ణువు వారి దగ్గిరకి వచ్చినప్పుడు వారిరువురు ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారికి గర్వభంగం కలిగీంచాలని ఒక పరీక్ష పెడతాడు.మేరుపర్వతం ఉత్తరభాగంలో ఉన్న ఆనందశిఖరాన్ని గట్టిగా చుట్టుకోమని ఆదిశేషునికి చెప్పి వాయుదేవునితో ఆ పర్వతాన్ని అక్కడ నుంచి కదల్చగలవేమో ప్రయత్నించమని చెబుతాడు. 

Tirumala Temple


ఈ పరీక్షలో తన బలాన్ని ప్రదర్శిస్తున్న వాయుదేవుని ధాటికి సమస్త లోకాలూ తల్లడిల్లుతుంటే బ్రహ్మ అభ్యర్ధన మేరకు ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలిస్తాడు.అంతట వాయుదేవుని ప్రభావం వల్ల ఆనంద శిఖరం కదిలిపోయి సర్వముఖి నది ఒడ్డున పడుతుంది.ఇది తెలిసి ఆదిశేషుడు బాధ పడుతుంటే బ్రహ్మ ఆ వేంకటాద్రిలో నిన్ను విలీనం చేస్తాను, అక్కడ శ్రీమహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి సముదాయించాడు. ఆదిశేషుడు విలీనం అయిన వేంకటాద్రి మీద విష్ణువు  పడగ అయిన శేషాద్రి పైన శ్రీనివాసుడుగా, మధ్యభాగమైన అహోబిలంలో శ్రీ నారసింహ స్వామిగా వెలిస్తే తోకభాగమైన శ్రీశైలంలో శివుడు శ్రీమల్లికార్జునుడుగా వెలిశారు అని పురాణాలు చెబుతున్నాయి. 

పద్మావతీ దేవి తిరుచానూరులో వెలిసి బ్రహ్మేంద్రాది దేవతలు సైతం ఎవరి దర్శనానికి వేత్రహస్తుల దెబ్బల్ని కూడా తట్టుకుంటూ పడిగాపులు పడుతూ ఉంటారో ఆ కందర్పదర్పహరసుందరదివ్యమూర్తిని తలచినదే తడవుగా తన వద్దకే రప్పించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నది.అప్పుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళినీ కూడా చూడలేని కొరతని ఇప్పుడు వకుళమాతగా జన్మించి తీర్చుకున్న యశోదమాతను తులసిమాలగా కంఠసీమలో అలంకరించుకున్నాడు శ్రీచక్ర శుభనిలయుడైన శృంగార శ్రీనివాసుడు!

 రామాయణ,భారత,భాగవతాది కధలలోని తన సంపూర్ణకృపకు నోచుకోని భక్తశిఖామణులను చరితార్ధులను చేస్తూ తన సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకున్నవారికి బ్రహ్మేంద్రాదులకు కూడా సాధ్యపడని తన నిజతనుస్పర్శను కూడా ప్రసాదించిన విశేషం ఈ శ్రీనివాసుని కధలో అంతర్లీనమై ఉండి భక్తవరదుని శిష్టజనవాత్సల్యాన్ని నిరూపిస్తున్నది!

No comments