ప్రసాదం లోని అంతరార్థం

హిందూ సంప్రదాయం ప్రకారం దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. హిందూమతంలో ఈ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటో ఓ సారి చూద్దాం..  పవిత్రమైన ఆహార పదార్థాన్ని దేవుడి ముందు ఉంచడం ద్వారా అది అమృతంగా మారి ప్రసాదం అవుతుంది.. అలా దేవుని ఎదుట ఉంచిన పరమ పవిత్రమైన ఈ ప్రసాదం దైవ భక్తిని పెంపొందించడంతో పాటు మానవుడిని ఆలోచనని కూడా పవిత్రతతో ఉంచుతుంది.ఇంకా మనిషిలోని ప్రతికూల స్పందనలను పారదోలి సానుకూల స్పందనలను కలిగిస్తుంది.అంతేకాకుండా పవిత్రమైన ప్రసాదాన్ని నలుగురికీ పంచడం ద్వారా ఇతరులతో సత్సంబంధాలు మెరుగవుతావాణి, ఎలాంటి పూజా కార్యక్రమమైనా ప్రసాదం లేకుండా పూర్తి కాబట్టి దేవుడికి ఏం నివేదించాలో తెలియనప్పుడు ఒక చిన్న పండును ఉంచినా అది ప్రసాదంగా మారుతుంది అని పూజారులు సైతం చెప్తారు.. ప్రసాదాన్ని కొంతమంది ఔషధంగా భావిస్తుంటారు.. ప్రసాదం తీసుకోవడం వల్లే వ్యాధులు నయం అయ్యాయి అని భావించేవాళ్లు కూడా ఉన్నారు. ఎలాంటి ఆహార పదార్థాన్నైనా దేవుడికి నివేదించి తినడం ద్వారా అందులో ఒకవేళ చెడు ఉన్నా అది హరించుకుపోతుందని భక్తుల నమ్మకం.

ప్రసాదం లోని అంతరార్థం

ఈ ప్రసాదాన్నీ ఇవ్వడం వెనుక మరో పరమార్థము కూడా ఉంది.  గుళ్ళో సాధారణంగా పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన భోజనం ఏముంటుంది. ఈ విధంగా  ఆ రోజునుంచి ఈ రోజు వరకు గుళ్ళు ప్రసాదం ఇవ్వడం ద్వారా కొంతమంది అభాగ్యుల కడుపు నింపుతూ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి.

అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది.మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది.

ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు.అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం.


No comments