శ్రీవారి నిజపాద దర్శనం

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

Srivari Nijapada Darshanam

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు.

ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ.వాటిని తిరిగి పునఃప్రతిష్టించారు.

ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.

శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

No comments