తిరుమలేశునికి పవళింపు సేవ
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునికి జరిగే సేవల్లో చివరి సేవ పవళింపు సేవ. ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ఆలయాన్ని మూసేముందు స్వామివారికి పవళింపు సేవ నిర్వహిస్తారు. ఈ పవళింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రి రెండు గంటల వేళ తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని మూస్తారు.
Annamayya Family members singing infront of Bogi Srinivasa Murthy during Ekanta Seva |
ముఖ మంటపంలో వెండి గొలుసులతో ఏర్పాటు చేసిన బంగారు ఊయలలో భోగ శ్రీనివాస మూర్తిని శయనింపచేసి పాలు, పళ్ళు, బాదంపప్పులను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూలవిరాట్టు పాదపద్మాలకు ఉన్న కవచాన్ని తొలగించి, చందనం రాస్తారు.
తిరుమలలో ప్రతిరోజూ రాత్రివేళల్లో బ్రహ్మదేవుడు వచ్చి వేంకటేశ్వరుని అర్చిస్తాడని పూరాణ కథనాలు ఉన్నాయి. అందుకే, వేంకటేశ్వర స్వామివారిని దర్శించేందుకు విచ్చేసే బ్రహ్మదేవుని కోసం వెండి పాత్రల్లో నీటిని సిద్ధంగా ఉంచుతారు. పవళింపు సేవలో తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలతో వేంకటేశ్వరుని నిద్రపుచ్చుతారు.
సంవత్సరంలో పదకొండు నెలల పాటు ఏకాంతసేవ భోగశ్రీనివాసునికి జరుపుతారు. ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి చేస్తారు.
రాత్రి రెండు గంటల వేళ స్వామివారికి పవళింపు సేవ ముగిసిన తర్వాత ముందుగా మూడో ద్వారాన్ని మూస్తారు.
ఆ తర్వాత బంగారు వాకిలి మూసి లోపలి గడియలు వేస్తారు. ఆలయ అధికారులు బయటి వైపు తాళాలు వేసి వాటిమీద సీలు వేస్తారు. తిరుమల ఆలయం మూసి ఉంచే సమయం చాలా తక్కువ. మరి కొద్దిసేపటికే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
అయినప్పటికీ తాళం వేయడం, దానికి సీలు కూడా వేయడం అనే సంప్రదాయం సనాతన ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
No comments